రేవంత్ రెడ్డికి ఉచ్చుబిగిస్తున్నారా ?

భూ ఆక్రమణలు నిజమేనని తేల్చిన అధికారులు, క్రిమినల్ కేసు.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి భూ ఆక్రమణల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ పూర్తి చేశారు. అంతేగాక, గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్, కబ్జాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

ఈ భూ ఆక్రమణలపై ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతోపాటు సర్వే నెంబర్ 127లోనే మరో 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్లుగా గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ దీనిపై పూర్తి నివేదికను మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. రేవంత్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ.. ఈ నివేదికలో ఆర్డీవో చంద్ర కళ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకుక రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో తన నివేదికలో సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన గోడలను కూడా కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *