విజయ్ దేవరకొండ..అమ్మాయుల ట్రాప్ పక్కా ప్లాన్ తో బట్టబయలు

విజయ్ దేవరకొండ..అమ్మాయుల ట్రాప్ పక్కా ప్లాన్ తో బట్టబయలు
అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ గారి యాటిట్యూడ్‌కి,నటనకు యూత్‌లో ఎంత క్రేజ్,ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విజయ్ ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని ఓ వ్యక్తి అతని పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు చాలామంది అమ్మాయిలకు వల వేశాడు. ఇటీవల ఈ విషయం హీరో విజయ్ దేవరకొండ దృష్టికి వెళ్లడంతో తనదైన శైలిలో అతనికి చెక్ పెట్టాడు.

విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి ఓ ఫేక్ పేజ్ క్రియేట్ చేశాడు. విజయ్‌కి ఉన్న ఇమేజ్‌తో చాలామంది దానికి రిక్వెస్ట్ పంపించారు. అందులో అమ్మాయిల ఖాతాలను గుర్తించి.. వారితో అతను మెసేంజర్ ద్వారా చాట్ చేసేవాడు. మొదట అతని అసిస్టెంట్ మాట్లాడినట్టుగా నటించి.. ఆ తర్వాత తనకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుతో చాట్ చేయాలని చెప్పేవాడు. ఒకవేళ వాళ్లు ఓకె చెబితే.. తర్వాత తానే నేరుగా చాట్ చేస్తానని చెప్పేవాడు. ప్రేమ,పెళ్లి,సహజీవనం పేరుతో మోసం.. అతని మాటలు నమ్మి కొంతమంది అమ్మాయిలు అతనితో చాట్ చేశారు. ఆ తర్వాత ప్రేమ,పెళ్లి,సహజీవనం అంటూ వారిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల విజయ్ సన్నిహితులు కొందరు ఈ విషయాన్ని గుర్తించారు. ఇదే విషయం విజయ్‌తో చెప్పగా.. తనే నేరుగా రంగంలోకి దిగాడు. అతని వాట్సాప్ నంబర్ తీసుకుని అసలు నిజం బయటపెట్టేందుకు తనదైన ప్లాన్ వేశాడు. తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే గోవింద్ అనే యువకుడిని యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్ చేయాలని చెప్పాడు.

పక్కా ప్లాన్‌తో.. విజయ్ ప్లాన్ ప్రకారం.. తన పేరు హేమ అంటూ గోవింద్ అతనితో వాట్సాప్ చాట్ చేశాడు. మిగతా అమ్మాయిలకు ఏవైతే చెబుతున్నాడో.. గోవింద్‌తోనూ అదే చెప్పాడు. మొత్తానికి గోవింద్ అతని నుంచి పలు కీలక వివరాలు రాబట్టాడు. దాదాపు 10 మంది యువతులను అతను మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ మేనేజర్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *