తెలంగాణ కు కరోనా… సమాధానం లేని ప్రశ్నలెన్నో!

తెలుగు రాష్ట్రాల్లో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ వ్యాధి, రెండు వారాల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడికి సోకిందని నిర్ధారణ అయింది. అయితే, కరోనా వైరస్, ఓ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తే, కనీసం రెండు వారాల పాటు నిద్రాణంగా ఉంటుంది. ఆ సమయంలోనూ అతని నడవడిక, చర్యలతో ఇతరులకు వ్యాపిస్తూ ఉంటుంది. ఆ తరువాత మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈలోగా, అదే వైరస్ మరెంతో మందికి వ్యాపించి వుంటుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు రెండు రోజుల పాటు బెంగళూరుకు వెళ్లి ఉద్యోగం చేసి వచ్చాడు. రెండు సార్లు బస్సులో ప్రయాణించాడు. బెంగళూరులో పలువురిని కలిశాడు. ఈ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. పైగా అది ఏసీ బస్సు. దీంతో ఒక్కసారి వ్యాధి బాధితుడు తుమ్మినా, దగ్గినా, వైరస్ సులువుగా వ్యాపిస్తుంది.ఇక బాధితుడి తోటి ప్రయాణికుల విషయాన్ని పక్కన పెడితే, అతని కుటుంబ సభ్యులు, వారికి వైరస్ సోకివుంటే, వారు బయటకు వెళ్లినపుడు మరెంతమందికి వ్యాధి సోకేందుకు కారణమయ్యారోనన్న ఆందోళన కూడా నెలకొని వుంది. సోమవారం నాడు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమావేశమైన వేళ, అత్యధిక సమయం ఈ విషయాలపైనే చర్చ సాగింది.
దుబాయ్ నుంచి వచ్చిన తరువాత బాధితుడు ఎంత మందిని కలిశాడు? అతనిని ఎన్ని రోజుల క్రితం వైరస్ సోకింది? అతని నుంచి ఎంత మందికి వైరస్ వ్యాపించింది? వారి నుంచి ఇంకెంతమందికి వైరస్ పాకింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఎవరి వద్దా సమాధాలు లేవు. అయితే, ప్రభుత్వం మాత్రం బెంగళూరు నుంచి బస్సులో వచ్చిన 27 మందినీ గుర్తించి, వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధితుడి మిత్రులు, బంధువుల్లో 11 మందిని గాంధీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించి, ఐసొలేషన్ వార్డులో ఉంచి పరీక్షించాలని కూడా ఈటల ఆదేశించారు.రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని తెలంగాణ సర్కారు ఆదేశించగా, ఆంధ్రప్రదేశ్ సైతం అప్రమత్తమైంది. బెంగళూరు నుంచి వచ్చి యువకుడి బస్సులో కొందరు ఏపీ వాసులు ఉండటం, వారు విశాఖ, విజయవాడ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించడంతో ఈ వైరస్ ఏపీకి కూడా వ్యాపించి వుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *