తెలంగాణ పై బిజెపి “బండి’ పట్టు సాద్యమా ?

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఏ ప్రాతిపదికన సంజయ్‌కి బీజేపీ పగ్గాలు అప్పగించారన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. అధ్యక్ష రేసులో చాలామంది సీనియర్ నేతలు కూడా ఉన్నప్పటికీ.. అధిష్టానం మాత్రం ఏరి కోరి సంజయ్‌నే ఎంచుకుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఉత్తర భారతదేశంలో ఎంత హవా కొనసాగిస్తున్నప్పటికీ.. దక్షిణాదిన పాగా వేసేందుకు బీజేపీ శక్తి సరిపోవట్లేదు. ఒక్క కర్ణాటక మినహా దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉన్న రాష్రం లేదు. కానీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చింది. దీంతో తెలంగాణపై కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలోనూ ఈసారి చాలా జాగ్రత్త కనబర్చింది. గతంలో అధ్యక్షులుగా చేసినవాళ్ల నుంచి గమనించిన విషయాలు.. తాజాగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు.. తెలంగాణ పరిస్థితులకు తగ్గ నాయకత్వం… వంటి అంశాలను బేరీజు వేసుకుని కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసింది. హైదరాబాదేతర నేతను నియమించాలని.. గతంలో నియమించిన అధ్యక్షులు కిషన్ రెడ్డి,లక్ష్మణ్ ఇద్దరు హైదరాబాదీలే కావడంతో.. ఈసారి హైదరాబాదేతర నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కిషన్ రెడ్డి,లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ.. హైదరాబాద్ అవతల పార్టీని విస్తరించడంలో వీరిద్దరు అంత ప్రభావవంతంగా పనిచేయలేదని పార్టీ ఒక అంచనాకు వచ్చింది. అందుకే 2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ అవతల పార్టీ ఒక్క విజయాన్ని నమోదు చేయలేదని గ్రహించింది. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాదేతర నేతకు అవకాశం ఇచ్చి చూడాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్‌కి పగ్గాలు అప్పగించింది. సంజయ్‌కే ఎందుకిచ్చారు.. సంజయ్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా సంఘ్ నుంచి ఇప్పటివరకు పార్టీనే అంటిపెట్టుకుని ఉండటం అధ్యక్ష పదవిలో ఆయనకు కలిసొచ్చిన అంశం. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు టీఆర్ఎస్,కాంగ్రెస్.. వెలమ,రెడ్ల నాయకత్వంలో ఉండటంతో.. అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు తిప్పుకోవడంలో సంజయ్ నాయకత్వం కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా కనిపిస్తుండటం.. భవిష్యత్తులో ఆ పట్టును కొనసాగించాలంటే అక్కడి నేతనే అవసరమని బీజేపీ భావించినట్టు తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్‌కు కంచుకోట కరీంనగర్‌లోనే ఆ పార్టీని దెబ్బకొట్టిన సంజయ్‌కు బాధ్యతలు అప్పగించింది. యువతలోనే సంజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఉండటం.. క్షేత్రస్థాయిలో ప్రతీచోటుకు తిరిగే నేత కావడం.. పార్టీకి అనుకూలిస్తుందని బీజేపీ భావించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను సమన్వయం చేయడంలోనూ.. భైంసా అల్లర్ల లాంటి ఘటనల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలోనూ సంజయ్ దూకుడు శైలి పార్టీకి మేలు చేస్తుందని భావించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *