రేపు ఆర్టీసీ సేవలుమే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణలో రేపు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు నడపుతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులకు, అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేదన్నారు. లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘మే 31 వరకు పొడిగించాలని మంత్రి వర్గంలో నిర్ణయించాం. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉంటాయి. ఆ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందే. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాల్సిందే. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో అన్ని చోట్లా అన్ని షాపులూ తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో మాత్రం సరి-భేసి విధానం అమలు చేస్తాం. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రేపు ఉదయం నుంచే ప్రారంభిస్తున్నాం. సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు మాత్రం నడపం. ఆటోలు, ట్యాక్సీలు పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని నడపాలి.
కంటైన్‌మెంట్‌ మినహా అన్ని చోట్లా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్‌కు నూరు శాతం అనుమతిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ శానిటైజ్‌ చేస్తారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్‌ యూనిట్లు పనిచేసుకోవచ్చు. మే 31 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది’’ అని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *