ఇద్దరు ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసులు

నగరంలో ఇవాళ జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తనతో దురుసుగా ప్రవర్తించారని ఒకరు, దుర్భాషలాడారని మరొకరు చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారంలో రహదారి శంకుస్థాపనకు వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొనబోయిన ఎమ్మెల్యేని యాచారం ఎంపీపీ సుకన్య అడ్డుకోబోయారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకి సహకరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐ నారాయణపై కూడా ఎంపీపీ ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలాపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తనతో దురుసుగా ప్రవర్తించారంటూ భాజపా నాయకురాలు బంగారు శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. చాదర్‌ఘాట్‌ పరిధిలో ఎస్సీ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బంగారు శ్రుతి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బలాలా తనను కించపరిచేలా మాట్లాడారని శ్రుతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రుతి ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్‌ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *