ప్రయాణికులకు సూచనలు పాటించండి!

కరోనా కారణంగా ఎయిర్‌ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఫిబ్రవరి 25న వియన్నా నుంచి దిల్లీకి ప్రయాణించిన వారిని స్క్రీనింగ్‌ సంబంధించి ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ప్రోటోకాల్ పాటించమని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ‘ఫిబ్రవరి 25న వియన్నా నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కాబట్టి ఆ విమానంలో ప్రయాణించిన వారు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ రోజు వియన్నా-దిల్లీ ప్రయాణించిన వారు భారత ఆరోగ్య శాఖ సూచనలను పాటించాల్సిందిగా కోరుతున్నాం’అని ట్వీట్‌లో పేర్కొంది. పూర్తి వివరాలకు భారత ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ఎయిర్‌ఇండియా విమానంలో ఫిబ్రవరి 25న వియన్నా నుంచి దిల్లీకి ప్రయాణించిన వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారించిన విషయం తెలిసిందే. దీంతో అతడి తోటి ప్రయాణికులు సైతం పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఆ విమానంలో విధులు నిర్వహించిన 10 మంది సిబ్బందిని ఇంటి వద్దే 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండమని సంస్థ సూచించింది. ఏ మాత్రం వైరస్‌ లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని కోరింది. మరోవైపు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఇటలీ, ఇరాన్‌, దక్షిణకొరియా, చైనా, సింగపూర్‌ వెళ్లవద్దని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *